Sunday, October 31, 2010

కాంతి రేఖ

"నా" తరవాత నాకు నా తెలుగు భాషంటే చాలా పిచ్చండి బాబు , ఎంత బాగుంటుందో కదా...మా అమ్మ సాక్షిగా నాకు అబ్బిన ఏ కొద్ది పాటి జ్ఞానంతోనే నేను ఇంత ఆనందంగా ఉంటె , ఇంకా కావ్యాలు రాసిన మహామహుల భావాలూ ఎలా ఉన్నవో కదా...హా హా హా హా హా...
 నాకు సూర్యుడు అంటే చాలా చాల ఇష్టం ,ఆయన లేని చీకటి అన్నా కూడా అంటే ఇష్టం , ఎందుకంటే ఆయన లేని లోటుని ప్రపంచానికి తెలియ చేస్తుంది కాబట్టి , ఒక రోజు పొద్దున్నే భూమికి ఊపిరులూదుతున్న మా బాస్ ని చూసి మది పులకరించి తనకు తానుగా పెల్లుబికిన భావ వాహిని..


                                                                             ఆవేళ

పచ్చ గడ్డిపై పరచుకున్న మంచు ముత్యాల కన్యలు ,
అప్పుడప్పుడే విచ్చుతున్న రవి వెచ్చని కౌగిట కరిగే వేళ..

నిశీధి ఇంట్లో నిదరోయిన నిప్పులు ,
ఉషోదయంతో ఉర్వికి ఊపిరులూదే వేళ..

వెండి వెన్నెల పండించిన జాబిలి,
సెలవంటూ పడమట దాగే వేళ ..

తూరుపు కన్యక నిద్దుర వదిలి ,
సింధూరం నుదుటిన దిద్దే వేళ..

స్వప్నంలో సృష్టించిన కొత్త కొత్త లోకాలు ,
కలలేనని కనులకు తెలివోచ్చే వేళ.

చలి గాలికి బిగిసిన ఆకుల జంటలు ,
వొళ్ళు విరుచుకుని అరిచే వేళ.

సూదంటి కిరణాలు చుర్రుమంటుంటే ,
పగడాల దీవిగా పుడమి పులకించే వేళ.

మసకలోకి దూరి , మగతలోకి జారి ,
స్వగతమంత మరచి , సంగతులు విరమించి ,
సద్దుమణిగిన జాతి నిద్ధరొదిలేలా ,  విశ్రమించిన వారి ఉనుకు కదిలేలా 

ఆ సూర్య భగవాను  సప్త హయములు కదిలి 
శాంత ప్రకోపాన జగతినంతా తిరిగి 
నింగికి , నేలకు మధ్యన వంతెన కట్టే వేళ 
భూబంతికి ఒక వైపంతా హారతులిచ్చే వేళ.

ఆ వేళలో 

పక్షులు కిలకిలా రావాల అక్షింతలు చల్లాయి .
సడలించిన తలుపుల సాక్షిగా గుడిగంటలు మ్రోగాయి .
ఉత్త  రోజులా ఉన్నా, ఒక కొత్త జగతికి నాంది ఇది 
హత్తుకునే మనసుంటే , ప్రతి ఉదయం ఆనంద నిధి..
 
  

No comments:

Post a Comment